క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు.. షాక్ ఇచ్చి త‌నిఖీ బృందాలు..!

Medchal collector and team  Shocked to traders,

మేడ్చల్ , జిల్లా ప్రతినిధి / మేడ్చల్ , మనం న్యూస్ :  కరోనా వైరస్ వ్యాప్తిని బ్రేక్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేదుకు అక్క‌డి జిల్లా క‌లెక్ట‌ర్  కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

లాక్‌డౌన్ నేప‌ధ్యంలో వ్యాపారులు ఎవ‌రైనా నిత్యవసర సరుకులు అధిక రేట్లకు అమ్మితే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ వాసం వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా గురువారం క‌లెక్ట‌ర్ ఏర్పాటు చేసిన‌ జిల్లా క‌మిటీ బృందాలు ఆక‌స్మిక త‌రిఖీ చేప‌ట్టారు. ఈ క్ర‌మంతో కుషాయిగూడ లోని ఒక మెడిసిన్ కంపెనీని త‌నిఖీ చేయ‌గా.. ఆ మెడిసిన్ కంపెనీలో అనధికారంగా మాస్కులు తయారుచేసి మహారాష్ట్ర లోని నాందేడ్‌కు తరలిస్తున్నట్లు గమనించారు.  

ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. ఆ మెడిసిన్ కంపెనీకి అవసరమైన లైసెన్స్ లేక‌పోవ‌డం. దీంతో ఆ కంపెనీకి జిల్లా త‌నిఖీ అధికారులు 35 వేల రూపాయలు జరిమానా విధిస్తూ,  ఆ మెడిసిన్ కంపెనీని సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇక అనధికారంగా తయారుచేసిన లక్ష మాస్క్‌ల‌ను స్వాదీనం చేసుకుని జిల్లా యంత్రాంగం, డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా క్వాలిటీని ప‌రిశీలించారు. అనంతరం ఆ మాస్కుల‌ను జిల్లా అవసరాలకు వినియోగించేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. 

ఇక మ‌రోవైపు కలెక్టర్ ఆధ్వర్యంలోని తనిఖీ బృందాలు ఈరోజు కుషాయిగూడలో పలు సూపర్ మార్కెట్ల పై కూడా ఆకస్మిక తనిఖీలు చేశారు. ముఖ్యంగా నిత్య‌వ‌స‌ర‌, అత్య‌వ‌స‌ర‌ వ‌స్తువులు లూజుగా అమ్ముతున్న‌ వారికి, ఈ కరోనా వైరస్ సోక‌కుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ త‌నిఖీ బృందం తెలియజేశారు. 

ఆ త‌ర్వాత‌ అల్వాల్ కూరగాయల మార్కెట్‌లో త‌నిఖీ చేశారు.అయితే అక్క‌డ‌ రద్దీ ఎక్కువగా ఉన్నందున, పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాన్ని వినియోగించుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసి, ప్రతి మనిషి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే రైతు బజారుల్లో నిర్ణయించిన ధరకే కూరగాయలు అమ్మాలని సంబంధిత ఎస్టేట్ అధికారిని ఆదేశించారు. ఇక‌ ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్, ఏసీపీ శివ కుమార్, కీసర ఆర్ డి ఓ  రవి, డ్రగ్ ఇన్స్పెక్టర్ గోవింద్ సింగ్, తూనికల కొలతల అధికారి పి. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.