108 అంబులెన్స్‌ను తగులబెట్టిన రౌడీషీటర్

108 అంబులెన్స్‌ను తగులబెట్టిన రౌడీషీటర్

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయి బీభ‌త్సం సృష్టించాడు. ఇవాళ తెల్ల‌వారుజామున రౌడీషీట‌ర్  పోలీస్ స్టేషన్ ఎదుటే 108 అంబులెన్స్ వాహనాన్ని తగులబెట్టాడు. సురేష్ అనే రౌడీ షీటర్ 108కు పదే పదే రాంగ్ కాల్స్ చేయడంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తుండ‌గా  రౌడీషీట‌ర్ సురేష్ అక్కడ హల్ చల్ చేశాడు. పోలీస్ స్టేషన్ కార్యాలయ అద్దాలు పగలగొట్టాడు. వింతగా ప్రవర్తిస్తుండ‌డంతో అతడి మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు గుర్తించారు. సురేష్ చేతికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు రప్పించారు.

దీంతో అక్క‌డికి వ‌చ్చిన 108 వాహనం ఎక్కిన సురేష్ వెంటనే వాహనం అద్దాలు పగులగొట్టి.. అందులో ఉన్న స్పిరిట్‌తో అంబులెన్స్‌ను తగులబెట్టాడు. దగ్ధమవుతున్న 108 వాహనంలోనే నిందితుడు ఉండటంతో బయటకు రమ్మన్ని పోలీసులు పిలిచినా రాక‌పోవ‌డంతో చాకచక్యంగా అతడిని బయటకు లాగేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఐతే అప్పటికే అంబులెన్స్ చాలా వరకు కాలిపోయింది. అనంతరం సురేష్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.