కేంద్ర విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తాం : కేసీఆర్ 

కేంద్ర విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తాం : కేసీఆర్ 

కేంద్ర విద్యుత్ చట్టాన్నితాము పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లుపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...  కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరమన్నారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని శాసనసభ వేదికగా సీఎం స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో రాష్ట్రాల హక్కులు హరించారని సీఎం ధ్వజమెత్తారు. కేంద్ర విద్యుత్ చట్టం వస్తే ఈఆర్సీ నియామకాలు తమ చేతిలో ఉండవని స్పష్టం చేశారు.
 కేంద్రం ప్రవేశపెట్టిన చట్టం చాలా ప్రమాదకరంగా ఉందని, ఈ నేపథ్యంలోనే తాను కేంద్రానికి లేఖ రాశానని తెలిపారు.  దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉంది. కానీ చెన్నైలో తాగునీటికి అనేక సమస్యలు ఉన్నాయి. దేశంలో 75 శాతం మంది మంచినీటి కోసం అల్లాడు తున్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలనే దృక్పథం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేకుండా పోయింది. దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉంది. పుష్కలంగా సరిపోయే నీరు ఉన్నా.. సాగుకు ఇవ్వలేదని, దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్ల పైనే ఉందన్నారు. ఇప్పటి వరకు 2.16ల‌క్ష‌ల‌ మెగావాట్లు మాత్రమే దేశంలో వాడారని, దేశ ప్రగతి కోసం మిగులు విద్యుత్‌ను వినియోగంలోకి తేవాలనే ఆలోచన లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని పరిపాలించే విధానంలో.. అంబేడ్కర్, ఇతర గొప్ప వ్యక్తులు ప్రవేశపెట్టిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నారని కేసీఆర్ అన్నారు.