సీఎం కేసీఆర్ హ‌రిత ప్రేమికుడు : కేటీఆర్ 

సీఎం కేసీఆర్ హ‌రిత ప్రేమికుడు : కేటీఆర్ 

సీఎం కేసీఆర్ మంచి హ‌రిత ప్రేమికుడు అని, ఆయ‌న‌ను మించిన హ‌రిత ప్రేమికుడు ప్ర‌పంచంలో ఎక్క‌డా లేరని అనుకుంటున్నాన‌ని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా అర్బ‌న్ పార్కుల అభివృద్ధిపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానంగా మాట్లాడుతూ... ప‌ట్ట‌ణ హ‌రిత ప్ర‌ణాళిక రూపొందించుకుని మొక్క‌లు నాటుతున్నార‌ని తెలిపారు. హ‌రిత‌హారం ఒక సంస్కృతిగా మారింద‌న్నారు. ప్ర‌తి పౌరుడి న‌ర‌న‌రాన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం ఉండిపోయింద‌న్నారు. 80 శాతం మొక్క‌లను బ‌తికించేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని కేటీఆర్ తెలిపారు. భ‌విష్య‌త్ త‌రాల కోసం ఈ కార్య‌క్ర‌మాన్ని సీఎం కేసీఆర్ చేప‌ట్టార‌ని చెప్పారు. రాష్ర్టంలో గ్రీన్ క‌వ‌ర్ 29 శాతానికి పెరిగింద‌ని, ఈ ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌న్నారు.  
ఇప్ప‌టికే తెలంగాణ‌లో 1893 అభివృద్ధి చెందిన‌ అర్బ‌న్ పార్కులు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ పార్కుల‌తో పాటు అద‌నంగా మ‌రో 1799 అర్బ‌న్ పార్కుల‌ను అభివృద్ధి చేయాల‌ని ప్ర‌తిపాదించామ‌న్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే 797 పార్కుల‌ను అభివృద్ధి చేశామ‌న్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 587, ఇత‌ర మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల ప‌రిధిలో 1109, హెచ్ఎండీఏ ప‌రిధిలో 103 పార్కుల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ పార్కుల్లో కొన్నింటిని ట్రీ పార్కులుగా, మ‌రికొన్నింటిని ల్యాండ్ స్కేప్, అర్బ‌న్‌, పంచ‌త‌త్వ పార్కులుగా అభివృద్ధి చేయాల‌ని ప్ర‌తిపాదించామని మంత్రి కేటీార్ తెలిపారు.