పాఠ‌శాల‌లు తెరిచేందుకు స‌మ‌యం : సబితా ఇంద్రారెడ్డి

పాఠ‌శాల‌లు తెరిచేందుకు స‌మ‌యం : సబితా ఇంద్రారెడ్డి

పాఠ‌శాల‌లు తెరిచేందుకు మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల్లో పాఠశాలల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానంగా మాట్లాడుతూ... విద్యాశాఖ తరపున మూడు రకాల సర్వే చేశామని చెప్పారు. రాష్ర్టంలో 85 శాతం మంది విద్యార్థుల నివాసాల్లో టీవీ ఉందని సర్వేలో తేలిందన్నారు. సర్వే ప్రకారం 40 శాతం విద్యార్థుల ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయన్నారు. టీవీ, స్మార్ట్ ఫోన్లు లేని వారిని పక్కవారితో అనుసంధానం చేశామని తెలిపారు. దూరదర్శన్‌, టీ శాట్ యాప్‌లో డిజిటల్ క్లాసులు జ‌రుగుతున్నాయ‌న్నారు. విద్యార్థుల ఫీడ్ బ్యాక్ కోసం వర్క్ షీట్స్ తయారు చేశామని చెప్పారు. విద్యార్థులందరూ ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారని మంత్రి తెలిపారు. 48 వేల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ బోధనను అందిస్తున్నామని పేర్కొన్నారు. అత్యధిక ఫీజులు వసూలు చేయొద్దని సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పారు.
అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా మార్చి 16 నుంచి పాఠశాలలను మూసివేయడం జరిగిందని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో పరీక్షల నిర్వహణపై ఆందోళన నెలకొన‌డంతో సీఎం చొరవ తీసుకుని అన్ని తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు తెరుస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.