సుశాంత్ కేసులో మరో ఆరుగురి అరెస్ట్‌

సుశాంత్ కేసులో మరో ఆరుగురి అరెస్ట్‌

సంచలనం రేపుతోన్న బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ కోణంలో మ‌రో ఆరుగురు అరెస్ట్ అయ్యారు. నార్కొటిక్స్‌ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసింది. దీంతో ఆ కేసులో అరెస్ట్ అయినవారి సంఖ్య 16కి చేరుకుంది. ముంబయికి చెందిన కరమ్‌జీత్ సింగ్ ఆనంద్, డ్వేన్ పెర్నాండెజ్‌, సంకేత్ పటేల్‌, అంకుష్ అన్రేజా, పందీప్ గుప్తా, అఫ్‌లాబ్ ఫతే అన్సారీని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

డ్రగ్స్ సరఫరాలో ఈ ఆరుగురు భాగం పంచుకున్నట్లు విచారణలో తేలింది. డ్రగ్ డీలర్‌గా పనిచేసే ఫెర్నాండెజ్‌ రియా సోదరుడు షోవిక్‌కి సహాయకుడిగా ఉండేవాడు. ఆనంద్ అనే డ్రగ్ డీలర్ దగ్గర పనిచేసే సంకేత్ పటేల్.. సెలబ్రిటీలకు మత్తుపదార్థాలు సరఫరా చేసేవాడు. ఇక గతంలో రిక్షా డ్రైవర్‌గా పనిచేసిన సందీప్ గుప్తా డ్రగ్ డీలర్లకు గంజాయిని సరఫరా చేసేవాడు. గుప్తా వద్ద అన్సారీ సహాయకుడిగా పనిచేసేవాడు. వీరిందరిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ విచారణను ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే నటి రియా, ఆమె సోదరుడు షోవిక్ సహా 10 మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. వీరందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రేపు ఏసీఎంఎం కోర్టులో హాజరుపరుస్తారు.