ఏపీలో మ‌రో ఇద్ద‌రు ఎంపీల‌కు క‌రోనా 

 ఏపీలో మ‌రో ఇద్ద‌రు ఎంపీల‌కు క‌రోనా 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైర‌స్ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో రోజురోజుకు ప‌దివేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతు న్నాయి. అలాగే క‌రోనాతో రోజూ దాదాపు వంద మంది వ‌ర‌కు మ‌ర‌ణిస్తున్నారు. అయితే క‌రోనా వైర‌స్ ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. సామాన్యులు మొద‌లుకొని డాక్ట‌ర్లు, పోలీసులు, సినీ ప్ర‌ముఖులు, రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఈ క‌రోనా వైర‌స్ వ‌దిలిపెట్ట‌డం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 5,67,123కు చేరుకున్న విష‌యం తెలిసిందే. అయితే  తాజాగా రాష్ట్రంలోని మరో ఇద్దరు ఎంపీలు క‌రోనా బారిన ప‌డ్డారు.
 చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప కరోనా వైరస్‌ బారినపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఎంపీకి పార్లమెంట్ సచివాలయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అలాగే అరకు వైసీపీ ఎంపీ మాదవికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. గత రెండు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతుంటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం మాధవి పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడే ఉండి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రెండు వారాల పాటు ఢిల్లీలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు. తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అరకు ఎంపీ మాధవి కోరారు.