నాలుగోసారి సీఎం పీఠమెక్కిన శివరాజ్‌సింగ్ చౌహాన్

నాలుగోసారి సీఎం పీఠమెక్కిన చౌహాన్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అనుకున్న‌ది సాధించింది. కాంగ్రెస్ పార్టీని గ‌ద్దె దింపి అధికారాన్ని చేప‌ట్టింది. అనూహ్య పరిణామాల మధ్య ఆ పార్టీ సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ లాల్జీ టాండన్ రాజ్‌భవన్‌లో ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి. 2005, 2008, 2013లో సీఎంగా పనిచేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా సాగింది.

పార్టీ సీనియర్ నేతలైన అరుణ్‌ సింగ్, వినయ్‌ సహస్రబుద్దే తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివరాజ్‌సింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆకాంక్షించారు. ఆయనో పరిపాలన దక్షుడని కొనియాడారు. అయితే చౌహాన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంతో.. కొత్త మంత్రి వర్గాన్ని వచ్చే వారంలో విస్తరించే అవకాశం ఉంది.
 మరోవైపు కేబినెట్ విస్తరణలో.. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి పెద్ద పీఠ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన..తన వెంట 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు. సింధియా బీజేపీలో చేరిన అనంతరం.. ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే.