నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మొత్తం 18 రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో అనేక అంశాలపై చర్చించబోతున్నారు. ఈ పార్ల‌మెంట్ సమావేశాల్లో 45 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు. కొత్త బిల్లులు, పెండింగ్ లో ఉన్న బిల్లులు కలిపి మొత్తం 45 బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. 
ఎన్నడూ లేని విధంగా తొలిసారి షిఫ్టుల పద్ధతిలో ఉభయసభల సమావేశాలు జరగనున్నాయి.  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు రాజ్యసభ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు శాసనసభ జరుగుతుంది. అంటే ప్రతిరోజూ నాలుగు గంటల చొప్పున ఉభయ సభలు సమావేశం అవుతాయి. అయితే, మొదటిరోజు ఉదయం లోక్ సభ, సాయంత్రం రాజ్యసభ జరుగుతుంది. కరోనా సమయంలో పార్లమెంట్ లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో జీరో అవర్ లేదని చెప్పినా మార్పులు చేసి జీరో అవర్ ను తీసుకొచ్చారు. అదే విధంగా ఇండియా... చైనా బోర్డర్ లో నెలకొన్న పరిస్థితుల గురించి ఉభయసభల్లో కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 
ఇక ఇదిలా ఉంటే ఈ సమావేశాలకు ఇద్దరు కీలక వ్యక్తులు దూరం కానున్నారు. హోం మంత్రి అమిత్ షా అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ సమావేశాలకు దూరం కానున్నారు. ఆమె అనారోగ్య సమస్యల కారణంగా దేశం విడిచి వెళ్ళారు. 
మరోవైపు పార్లమెంటులో చాలా కార్యకలాపాలను డిజిటలైజ్‌ చేశారు. ప్రతి సభ్యుడు భౌతిక దూరం పాటించేలా ఎంపీల సీట్లలో మార్పులు చేశారు. అలాగే గ్యాలరీల్లోనూ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం పార్లమెంటు ప్రాంగణాన్ని శానిటైజ్ చేశారు. ఇక రాజ్యసభ సభ్యుల్లో అధిక వయస్సువారే ఎక్కువగా ఉండటంతో వారికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.