ఇరాన్‌ క్రీడాకారుడికి మరణశిక్ష

iran player was hanged

ఇరాన్‌ ప్రభుత్వం ఓ క్రీడాకారుడికి మరణశిక్షను అమలు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేశాడని ఆరోపిస్తూ ఈ శిక్షను విధించింది. నవీద్‌ అఫ్కారీ (27) అనే రెజ్లర్‌కు ఇరాన్‌ అధికారులు మరణశిక్షను విధించారు. 2018లో జరిగిన ఓ ప్రభుత్వ ఆందోళనలో నవీద్‌ ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేశాడన్నది అతనిపై ఆరోపణ. ఈ ఆరోపణలను అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పూర్తిగా ఖండించింది.
అంతకుముందు నవీద్‌కు చెందిన ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. ''నాకు మరణశిక్షను అమలు చేస్తే మీకో విషయం తెలియాలనుకుంటున్నాను. స్వశక్తిపై పోరాటం చేయాలనుకుంటున్న వ్యక్తి ప్రాణాలు తీశారు'' అని ఉంది.
నవీద్‌ను చివరి సారి చూసేందుకు అతని కుటుంబానికి కనీసం అవకాశం కూడా కల్పించలేదు.
నవీద్‌కు మరణశిక్షను నిలిపివేయాలని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85వేల మంది అథ్లెట్లు ఇరాన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అతడిని అన్యాయంగా లక్ష్యంగా మార్చుకొన్నారని ది వరల్డ్‌ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా నవీద్‌కు క్షమాభిక్ష ఇవ్వాలని కోరారు. నవీద్‌పై చర్య విచారకరమని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ పేర్కొంది.