ట్రంప్ ప్రచారంలో మోడీ ప్రస్తావన

Modi's mention in the Trump campaign

నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం ఊపందుకుంది. అధ్యక్షుడు ట్రంప్, ప్రత్యర్థి జో బైడెన్ మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కరోనా మహమ్మారి రావడంతో దానిని ఎదుర్కొనడానికి అమెరికా శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది.
అమెరికా భారీ ఎత్తున టెస్టులు నిర్వహిస్తోంది. ఇప్పటికే అమెరికాలో 5.9 కోట్ల టెస్టులు నిర్వహించారు. ప్రపంచంలో అత్యధిక టెస్టులు చేసిన దేశంగా అమెరికా రికార్డ్ సాధించింది. కరోనాపై అమెరికా పోరాటం చేస్తూనే ఉన్నది. ఒకవైపు కరోనాకు వాక్సిన్ ను కనిపెట్టేందుకు అమెరికన్ కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రచారం సమయంలో అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్, చైనాపై విరుచుకుపడ్డారు. జో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్టే అంటూ విమర్శించారు. ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి ప్రధాన కారణం చైనా అని, జో గెలిస్తే చైనాకు సపోర్ట్ చేస్తారని అన్నారు. అలా జరగకుండా ఉండి, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పాదంలో నిలవాలి అంటే అమెరికన్ ప్రజలు తనకు ఓటు వేయాలని అన్నారు. కరోనా విషయంలో అమెరికా చేపడుతున్న పరీక్షలను, కృషిని భారత ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారని అన్నారు. 5.9 కోట్ల టెస్టులతో అమెరికా ప్రథమస్థానంలో ఉండగా, ఇండియా 5.6 కోట్లకు పైగా టెస్టులు నిర్వహించినట్టు ట్రంప్ పేర్కొన్నారు.