తల్లి పేరిట స్కాలర్ షిప్ ప్రకటించిన సోనూసూద్

SONUSOOD ANNOUNCE SCHOLARSHIP

లాక్ డౌన్ హీరోగా దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న.. రీల్ విలన్, రియల్ హీరో సోనూ సూద్.. మరో మంచిపని మొదలు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన తల్లి పేరిట స్కాలర్ షిప్ అందించబోతున్నారు. పేద విద్యార్థులే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు సోనూ. తన తల్లి, ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ పేరు మీదుగా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. దీనికోసం scholarships@sonusood.me లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు సోనూ సూద్.
ప్రస్తుత కాలంలో విద్య ఎంత ఖరీదైన వనరుగా మారిందో చూస్తున్నాం.
దీంతో చాలా మంది పేదలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవ్వాలన్నా చాలా మంది విద్యార్థుల దగ్గర స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు లేవు. కొందరు ఫీజులు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో నేను దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాను. ప్రతిభ గల పేద విద్యార్థులకు నా తల్లి పేరు మీద స్కాలర్‌షిప్‌ అందిస్తాను. మా అమ్మ సరోజ్ సూద్ గారు పంజాబ్‌ విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పారు. ఆమె స్ఫూర్తిని నేను కొనసాగించాలనుకుంటున్నాను' అన్నారు సోనూ సూద్.
అయితే స్కాలర్ షిప్ పొందాలనుకునేవారికి కొన్ని అర్హతలు కూడా ఉండాలని కండిషన్ పెట్టారు సోనూ సూద్. పేదరికమే వారికి ప్రధాన అర్హతగా ఉంటుందని చెప్పారు. కుటుంబ వార్షిక ఆదాయం 2లక్షలకంటే తక్కువ ఉన్న వారికే ఈ స్కాలర్ షిప్ వస్తుంది. అలాంటి వారే దీనికి అప్లై చేసుకోవాలని సూచించారు. పేదవారు కావడమే కాదు, వారికి మంచి మార్కులు కూడా వచ్చి ఉండాలి. పేదరికంతోపాటు మెరిట్ కూడా ఉన్నవారిని సెలక్ట్ చేసుకుని వారికి స్కాలర్ షిప్ ఇస్తామన్నారు సోనూ సూద్. 'మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఫ్యాషన్, జర్నలిజం, బిజినెస్ స్టడీస్ వంటి కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. విద్యార్థుల ఫీజు, వసతి, ఆహారం అన్ని విషయాలను చూసుకునేలా ఈ స్కాలర్ షిప్ అందిస్తామన్నారు. ఇంకెందుకాలస్యం.. మీకు తెలిసిన పేద విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కి అప్లై చేసేలా ప్రోత్సహించండి. ఈ మంచిపనిలో మీరూ భాగస్వాములు కండి.