కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి రుఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ (74) ఇవాళ‌ ఉదయం కన్నుమూశారు. ఇటీవల కరోనాబారినపడ్డ ఆయన కోలుకున్నారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ‌ తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రఘువంశ్ ప్రసాద్ పనిచేశారు. 
ఆయన పదవీకాలంలోనే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. బీహార్‌లోని వైశాలీ నియోజకవర్గం నుంచి ఆయన లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ఆ నియోజకవర్గం నుంచి రికార్డుస్థాయిలో ఐదుసార్లు గెలుపొందారు. అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో (2014, 2019) ఎన్నికల్లో ఆయన ఓటమిని చవిచూశారు. కాగా ఆర్జేడీ పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువంశ్ ఇటీవ‌లే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాదాపు 32 సంవత్సరాలు పార్టీలో కొనసాగిన ఆయన, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు రాజీనామా లేఖను పంపారు.