అంతరిక్షంలో 700 కోట్ల సంవత్సరాల తర్వాత

BLACK HOLES IN GALAXY

ఖగోళశాస్త్రవేత్తలు అత్యంత శక్తివంతమైన బ్లాక్‌హోల్‌ను గుర్తించారు. రెండు భారీ కృష్ణ బిలాలు ఢీకొనడం వల్ల ఆ బ్లాక్‌హోల్ ఏర్పడినట్లు చెబుతున్నారు. గురుత్వాకర్షణ తరంగాల ద్వారా ఆ భీకర బ్లాక్‌హోల్‌కు సంబంధించిన వాస్తవాలను ఖగోళశాస్త్రవేత్తలు పసికట్టారు. ఏడు బిలియన్ల ఏళ్ల క్రితం కృష్ణ బిలాల సంగమం జరిగినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికా, ఇటలీలో ఉన్న లేజర్ డిటెక్టర్లకు బ్లాక్ హోల్ తరంగాలు చేరినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు బిలాలు ఢీకొనడం వల్ల సూర్యుడి కన్నా సుమారు 150 రెట్ల అధిక బరువు ఉండే బ్లాక్‌హోల్ ఏర్పడినట్లు తేల్చారు. కృష్ణ బిలాలు ఢీకొనడాన్ని GW190521గా నామకరణం చేశారు.
తాము గుర్తించిన అతిపెద్ద బ్లాక్‌హోల్ సంగమం అని శాస్త్రవేత్తలు చెప్పారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద బ్లాక్‌హోల్ తరంగాలను గుర్తించలేదన్నారు.
కొత్తగా గుర్తించిన బ్లాక్‌హోల్ ఆశ్చర్యంగా ఉన్నట్లు ఖగోళశాస్త్రవేత్త సైమన్ పోర్జీజిస్ జ్వార్ట్ తెలిపారు. నెదర్లాండ్స్‌లోని లీడెన్ యూనివర్సిటీలో ఆయన విశ్లేషణ చేస్తున్నారు. ఈ ఘటనతో ఇంటర్మీడియేట్ బ్లాక్ హోల్స్ ఉన్నట్లు గుర్తించామన్నారు. సాధారణ నక్షత్రాల కన్నా.. ఈ బ్లాక్‌హోల్స్ భారీ సైజ్‌లో ఉన్నాయని, కానీ ఇవేమీ సూపర్‌మాసివ్ బ్లాక్ హోల్స్ కాదన్నారు. బ్లాక్‌హోల్స్ నుంచి తరంగాలను 2019 మే 21న గుర్తించారు. అమెరికాలో ఉన్న లీగో డిటెక్టర్‌తో పాటు ఇటలీలోని విర్గో అబ్జర్వేటరీ ఈ తరంగాలను పసికట్టింది. ఆ తేదీల ఆధారంగానే GW190521 పేరు పెట్టారు. భారీ నక్షత్రాలు పేలడం వల్ల కృష్ణ బిలాలు ఏర్పడుతుంటాయి. వాటి నుంచి కనీసం వెలుతురు కూడా ప్రవేశించలేదు.