మాజీ మంత్రి సాంబ‌శివ‌రాజు క‌న్నుమూత‌

మాజీ మంత్రి సాంబ‌శివ‌రాజు క‌న్నుమూత‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత పెనుమత్స సాంబశివరాజు (89) అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా విశాఖలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. ఆయన ఏపీలో అత్యధికసార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఎనిమిది పర్యాయాలు శాసన సభ్యునిగా ఎన్నికైన ఆయన, 1968లో తొలిసారి శాసనసభ కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఒక్కసారి మినహా పోటీచేసిన అన్నిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989-94 లో మంత్రిగా, 1958లో సమితి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. గజపతినగరం, సతివాడ శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల సీఎం జగన్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు పెనుమత్స సాంబశివరాజు అని జగన్‌ అన్నారు.