చిత్తూరు జిల్లాలో క‌రోనా విజృంభ‌ణ‌

చిత్తూరు జిల్లాలో క‌రోనా విజృంభ‌ణ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోజురోజుకు క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతోంది. రోజూ భారీ స్థాయిలో క‌రోనా కేసులు న‌మోదవుతున్న విష‌యం విదిత‌మే. అయితే రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కరోనా వైర‌స్ విజృంభిస్తోంది. జిల్లాలో కేసుల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. గత మూడు రోజులుగా వెయ్యికి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు వైరస్‌ విజృంభిస్తుండంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. దీంతో జిల్లా పాజిటివ్ కేసుల సంఖ్య 17,263లకు చేరింది. అలాగే ప్రస్తుతం 7,250 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అలాగే 9,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆదివారం నాడు పది మరణాలు సంభవించ‌డంతో జిల్లాలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 171కి చేరింది. 
ఇప్ప‌టికే జిల్లాలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, సిబ్బంది 200 మంది కరోనా బారిన పడ్డారు. పౌర రక్షణ విధుల్లో పాల్గొంటున్న 250 మంది పోలీసులు, సిబ్బందికి సైతం కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో అధికారులు, ట్రైనీ కానిస్టేబుళ్ళ‌లో 120 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అలాగే చిత్తూరు జిల్లాలో 14 ఆర్టీసీ డిపోల్లో పనిచేసే 112 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో తిరుమల ఆర్టీసీ డిపోలో పనిచేసే 27 మందిని కరోనా కాటేసింది. టీటీడీలో సైతం ఆదివారం నాటికి 748 మంది కరోనా బారిన పడినట్టు ఈఓ అనిల్ సింఘాల్ తెలియజేశారు. వారిలో తిరుమలలో 361, తిరుపతిలో 387 మంది ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 305 మంది కరోనా నుంచి కోలుకోగా... మరో 338 చికిత్స తీసుకుంటున్నారని ఈఓ వెల్లడించారు. కరోనా బారిన పడి ఇప్పటికే టీటీడీలో ఇద్దరు అర్చకులు, ఒక ఉద్యోగి మృతి చెందారు. అలాగే అర్బన్ పోలీసు జిల్లాలో ఒక సీఐ, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డ్‌ను మృత్యువు కబలించింది. అలాగే శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 848 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాత్రికి మరో 166 కేసులతో కలిపి మొత్తంగా కొత్త కేసులు 1,014 వరకు చేరుకున్నాయి. కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతుండ‌డంతో జిల్లా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.