'బిగ్‌బాస్-4' షూటింగ్‌ షురూ

BIGBOSS-4 STARTS SHOOTING

తెలుగు బిగ్‌బాస్‌కు సంబంధించి మొదటి అడుగు పడింది. 'సీజన్‌-4' టీజర్‌ షూటింగ్‌ షురూ చేశారు.
తన వాక్పటిమ, చతురతతో గత సీజన్‌ను రక్తికట్టించిన అగ్ర కథానాయకుడు నాగార్జున ఈసారి కూడా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన యాడ్‌ షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ఈ షూటింగ్‌ జరిగింది.
సోగ్గాడే చిన్నినాయన' దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దీనికి దర్శకత్వం వహించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ చిత్రీకరించారు. త్వరలోనే ఈ యాడ్‌ను విడుదల చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌-4లో పాల్గొనే వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇది ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ సీజన్‌లో పాల్గొనే వారికి ముందుగానే కొవిడ్‌-19 పరీక్షలు చేసి, క్వారంటైన్‌కు తరలిస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాతే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుమతిస్తారు. కరోనా కారణంగా ఈసారి బిగ్‌బాస్‌ను మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎవరెవరు ఈ సారి హౌస్‌లోకి వెళ్తారో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే!