క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాల‌రావు మృతి

క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాల‌రావు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు రికార్డుస్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష దాటిన విష‌యం విదిత‌మే. సామాన్య ప్రజ‌లు మొద‌లుకొని డాక్ట‌ర్లు, పోలీసులు, ప్ర‌ముఖులు, ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ర‌కు క‌రోనా వైరస్ బారినపడి ఆస్పత్రి పాలవుతున్నారు. కొంత మంది కోలుకుంటున్నారు... మ‌రికొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. బీజేపీ సీనియర్‌ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్యాలరావు శనివారం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా మాణిక్యాలరావు ఇటీవల కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. 2014లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మాణిక్యాల‌రావు మృతిపట్ల బీజేపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.