సూర్యాపేటలో దారుణం

sad incident in suryapeta

తండ్రి ఇచ్చిన ఆస్తినంతా తీసేసుకొని, చివరికి ఆయన చనిపోయాక తనకేం సంబంధం లేదంటూ మొహం చాటేసింది ఓ కుమార్తె.

ఈ హృదయవిదారక ఘటన సూర్యాపేట జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట పట్టణానికి చెందిన తోట మల్లయ్య(75), జయమ్మ దంపతులకు ఒక కుమార్తె ఉంది.
ఆమె వివాహాన్ని ఘనంగా జరిపించారు. భవిష్యత్తులో తల్లిదండ్రులను తానే చూసుకుంటానని చెప్పి, కుమార్తె, అల్లుడు ఆ వృద్ధ దంపతుల వద్ద ఉన్న రూ.4 లక్షలను తీసుకెళ్లిపోయారు. కానీ ఆ తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోలేదు. గత కొద్దికాలంగా మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

ఆయన ఆరోగ్యం విషమించడంతో బుధవారం సూర్యాపేటలోని తన ఇంట్లో మృతి చెందాడు. ఈ విషయాన్ని బంధువులు కుమార్తెకు తెలియజేయగా కూతురు తనకు సంబంధం లేదని బదులిచ్చింది. దీంతో ఏం చేయాలో తెలీక భర్త మృతదేహాన్ని అతని భార్య తన కుమార్తె ఇంటికి తీసుకొచ్చింది. కూతురు ఇంటి ఎదుట భర్త మృతదేహాన్నిఉంచి బుధవారం రాత్రంతా ఏడుస్తూ తన కూతురిని కనకరించమని వేడుకుంది. అయినా  కూతరు కానీ, అల్లుడు కానీ ఆమె గోడును పట్టించుకోలేదు.

దీంతో స్థానికులు ఈ ఘటనపై స్పందించి ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కుమార్తె ఇంటికి వెళ్లి ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తండ్రి అంత్యక్రియలు జరిపించేలా వారిని ఒప్పించి అంత్యక్రియలు జరిగేలా చూశారు. పోలీసులు మరోసారి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో మృతుడి భార్య పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.