భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

STOCK MARKET GOT HUGE LOSE

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల మధ్య మదుపరులు లాభాల స్వీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 421.82 పాయింట్లు లేదా 1.10 శాతం కోల్పోయి 38,071.13 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 97.70 పాయింట్లు లేదా 0.86 శాతం పడిపోయి 11,202.85 వద్ద నిలిచింది. రిలయన్స్‌ షేర్‌ విలువ అత్యధికంగా 3.75 శాతం క్షీణించగా, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతి, టెక్‌ మహీంద్రా షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌అండ్‌టీ షేర్ల విలువ 4.54 శాతం పెరిగింది. ఇక ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్‌, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో ముగియగా, జపాన్‌ నష్టపోయింది.
ఐరోపా సూచీల్లో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ సమావేశం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెప్తున్నారు.