అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండైన రాఫెల్ యుద్ధ విమానాలు 

అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండైన రాఫెల్ యుద్ధ విమానాలు 

ఎంతో ఎదురుచూస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్ర‌వేశించాయి. 7వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి జెట్ ఫైట‌ర్స్ భార‌త్ చేరుకున్నాయి. దీంతో భారత వైమానిక దళం చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. ఫ్రాన్స్ నుంచి అంబాలా వైమానిక స్థావరానికి వస్తున్న తొలిబ్యాచ్‌లోని ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇవాళ భారత గగనతలంలో ప్రవేశించాయి. సోమవారం మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన ఏడుగంటల తర్వాత విమానాలు కొద్దిసేపు యూఏఈలోని అల్ ధఫ్రా వైమానిక స్థావరంలో ఆగాయి. ఈ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత రెండు సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలు వీటిని తోడుకుని వస్తున్నాయి. నిన్న 30 వేల అడుగుల ఎత్తులో ఓ ఫ్రాన్స్ ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. విమానాల‌కు ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ స్వాగ‌తం ప‌లికారు. ఈ యుద్ధ విమానాలు 17వ వైమానిక స్క్వాడ్ర‌న్ లో చేరనున్నారు. ఆగ‌స్ట్ లో రెండో విడ‌త రాఫెల్ యుద్ధ విమానాలు భార‌త్ కు రానున్నాయి. రాఫెల్ తో భార‌త వైమానిక వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతం కానుంది. 9500 కిలోల ఆయుధాల‌ను మోసుకెళ్ల‌గ‌లిగే స‌త్తా రాఫెల్ యుద్ధ విమానాల‌కుంది. అలాగే నిమిషానికి 2500 రౌండ్లు పేల్చే సామ‌ర్థ్య‌ముంది.