ఆన్ లైన్ ఆటలకు యువకుడు బలి

YOUNG MAN SUICIDE DUE TO ONLINE BETTING

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్‌ కుమారుడు మధుకర్‌ (24) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసయ్యాడు. తన మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ బెట్టింగ్‌ కాయడంతో తీవ్రంగా నష్టపోయాడు. ఇలా తెలిసినవారి వద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించి.. అప్పులన్నీ తీర్చారు. అయితే తాను చేసిన అప్పులకు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని ఆవేదనకు గురైన మధుకర్‌ ఈనెల 7న ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మంచిర్యాలలో క్రిమిసంహారక మందు తాగి తన అక్కకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. వారు అక్కడున్న స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా.. పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.