సాక్షి ఛానెల్‌లో బిత్తిరి సత్తి

BITHIRI SATTI ENTRY IN SAKSHI

చేవెళ్ల రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తి.. శుక్రవారం సాక్షి ఛానెల్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఇటీవల టీవీ9కి బిత్తిరి సత్తి రాజీనామా చెయ్యడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. బిగ్ బాస్ 4 షోలో పాల్గొనడం కోసమే అతను రాజీనామా చేశాడంటూ టీవీ9 అనుకూల వర్గం ప్రచారంలోకి తెచ్చింది. అయితే యాజమాన్యం తీరువల్లే టీవీ9 నుంచి సత్తి బయటకు వచ్చాడనే ప్రచారాన్నే ఎక్కువ మంది నమ్ముతున్నారు.
నిజానికి రవిప్రకాశ్ నుంచి మైహోమ్ రామేశ్వరరావు చేతికి టీవీ9 పగ్గాలు వచ్చాక, వీ6 నుంచి మంచి ప్యాకేజీతో సత్తిని తీసుకొని వచ్చారు.
అదివరకు తీన్మార్ వార్తలకు సత్తి వల్ల ఎలాంటి పాపులారిటీ వచ్చిందో, అతను టీవీ9లోకి వచ్చాక ఇస్మార్ట్ న్యూస్‌కు సైతం అంత పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు అతను లేని లోటు ఇస్మార్ట్ న్యూస్‌లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు సత్తి.. సాక్షి ఛానెల్‌లో చేరడంతో టీవీ9 అనుకూల వర్గం చేస్తున్న ప్రచారంలో ఎలాంటి పస లేదని తేలిపోయింది. ఇప్పుడు సాక్షి అతడిని ఎలా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం అతను ఛానెల్‌లో చేరిన సందర్భంగా ఉద్యోగులు అతనికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేయడం గమనార్హం.