నిబంధనలను అతిక్రమిస్తే ఇక అంతే!

ap govt gives warning to private schools

కరోనా కారణంగా మార్చి 23 నుంచి మూతపడిన పాఠశాలలు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. జూలై 31 వరకు బడులు తెరిచేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితేనే తెరుచుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు చాలా వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్ తరగతులపై ఏపీ సీరియస్ వార్నింగ్ ఇస్తోంది.
దేశంలో పంజా విసురుతున్న కోవిడ్.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అలజడి రేపుతోంది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఇంకా విద్యా సంవత్సరాన్ని ఖరారు చేయలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కానీ, కొన్ని ప్రైవేటు స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని వారు వెల్లడించారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే కొన్ని స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం చెప్పే వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదన్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రవర్తించే ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.