సీఎం జ‌గ‌న్ కు ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు లేఖ 

సీఎం జ‌గ‌న్ కు ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు లేఖ 

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చిన విషయంపై సీఎం జగన్‌కు నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణ రాజు సమాధానం చెబుతూ లేఖ రాశారు. సీఎం వైఎస్ జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరుపేజీల లేఖ రాశారు. ముందుగా సీ ఓటర్‌ సర్వేలో 4వ స్థానం వచ్చినందుకు జగన్‌కు అభినందనలు తెలిపారు. త్వరలో మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. 
అనంతరం తనపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని, అలాగే తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని లేఖలో ఆయన పేర్కొన్నారు. అలాగే విజయసాయిరెడ్డి పేరు మీద పంపించిన షోకాజ్ నోటీసు.. పార్టీ పేరు అంశాన్ని ప్రస్తావించారు. రిజిస్టరైన‌ పార్టీ కాకుండా తనకు మరో పార్టీ లెటర్‌ హెడ్‌ తో నోటీసు వచ్చిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని ఆయన గుర్తుచేశారు.. తనపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, మీకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు. తాను వెంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడినని చెప్పారు. స్వామివారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలను మాత్రమే తాను వివరించి చెప్పానని తెలిపారు. ఆస్తుల అమ్మకం విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మాత్రమే చెప్పానని అన్నారు. అంతేగానీ, తాను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు.