చైనాకు ధీటుగా బ‌దులిచ్చాం : ప‌్ర‌ధాని మోడీ 

చైనాకు ధీటుగా బ‌దులిచ్చాం : ప‌్ర‌ధాని మోడీ 

గాల్వన్‌ లోయ వద్ద చైనా సైనికులతో జూన్‌ 15న చోటు చేసుకున్న ఘర్షణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మ‌రోసారి స్పందించారు. సరిహద్దుల్లో చైనా దూకుడుకు దీటుగా బదులిచ్చామని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఇవాళ‌ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్ర‌ధాని మాట్లాడుతూ... గ‌ల్వాన్ లోయ‌లో చైనా బ‌ల‌గాల‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికుల త్యాగాలను ప్ర‌ధాని కొనియాడారు. మనం సుఖంగా జీవించేందుకు వారు తమ ప్రాణాలను ఫ‌ణంగా పెట్టారని పేర్కొన్నారు.  దేశం స్వయం సమృద్ధి సాధించేలా పౌరులు చొరవచూపాలని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.
స్థానిక‌ ఉత్పత్తుల వాడకానికే దేశ ప్ర‌జ‌లు మొగ్గుచూపాలని ప్ర‌ధాని మోడీ కోరారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ దేశం రక్షణ, సాంకేతిక రంగాల్లో బలోపేతమవుతున్న‌ద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం భారత్‌ పాటుపడుతున్న‌ద‌ని చెప్పారు. ప్ర‌పంచ దేశాల‌తోపాటు దేశంలోనూ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ద‌ని, క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌తి ఒక్క‌ర‌ నియమాలను క‌చ్చితంగా పాటించాల‌ని, లేదంటే ప్రమాదంలో పడతామని ప్ర‌ధాని హెచ్చరించారు.సరిహద్దుల వద్ద దేశాన్ని కాపాడే క్రమంలో 20 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారని ఆయన కొనియాడారు. 2020లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, అన్ని సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.