జూన్ 21న సంపూర్ణ సూర్యగ్రహణం

Absolute eclipse on June 21st

ఈ సంవత్సరం సూర్యగ్రహణం జూన్ 21న ఆదివారం ఉదయం ఏర్పడనుంది. ఈ గ్రహణం పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాగా వలయాకారంలో కనువిందు చేయనుంది. ఈ ఖగోళ పరిణామం ఫలితంగా ఆకాశంలో 'జ్వాలా వలయం' ఏర్పడుతుంది. జూన్ 21న ఆదివారం ఉదయం 9:15 గంటలకు గ్రహణం ప్రారంభమై, మధ్యాహ్నం 3.04 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు గరిష్ఠ స్థితిలో ఉంటుంది.

వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా చందమామ  అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని 'జ్వాలా వలయం'గా పిలుస్తారు. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుంది. కొన్నిసార్లు 12 నిమిషాలకుపైగా కనిపిస్తుంది.

ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో, హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లోని దీవుల్లో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది. రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ కారిడార్ వెంట గరిష్టంగా 30 సెకన్ల పాటు ముత్యాల హారంగా సూర్యుడు కనిపిస్తాడు.

ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ 2031లోనే భారత్‌లో ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడరాదని, దీని వల్ల శాశ్వతంగా అంధత్వం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.