ఐపీఎల్‌ నిర్వహిస్తాం : సౌరవ్‌ గంగూలీ

ఐపీఎల్‌ నిర్వహిస్తాం : సౌరవ్‌ గంగూలీ

కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఐపీఎల్‌కు రెడీగా ఉండాలంటూ ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ చీఫ్ గంగూలీ లేఖలు రాశాడు. అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.
ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌ టోర్నీని.. అవసరమైతే ఖాళీ స్టేడియాల్లోనూ నిర్వహించే అవకాశం ఉందన్నారు. కోవిడ్‌19 వల్ల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ .. నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కానీ ఆ మెగా టోర్నీని ఈ ఏడాది నిర్వహించేందుకు విశ్వాసంగా ఉన్నట్లు గంగూలీ తెలిపారు. టోర్నీ నిర్వహణకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఐసీసీ బోర్డు మీటింగ్‌ తర్వాత ఈ అంశంపై బుధవారం రాత్రి అన్ని సంఘాలకు గంగూలీ లేఖ రాశారు.
ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా ఐపీఎల్‌ను నిర్వహించే ఆసక్తితో గంగూలీ ఉన్నట్లు ఆ లేఖ ద్వారా తెలుస్తోంది. అభిమానులు, ఫ్రాంచైజీలు, ప్లేయర్లు, బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లు, స్టేక్‌ హోల్డర్లతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు గంగూలీ తెలిపారు. భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు.. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ఆసక్తిని ప్రదర్శించారని, మేం కూడా ఈ టోర్నీపై ఆశగా ఉన్నామని, భవిష్యత్తు కార్యాచరణనను త్వరలో వెల్లడించనున్నట్లు గంగూలీ తెలిపారు.