ఏపీలో టెన్త్ పరీక్షలకు సన్నాహాలు

ఏపీలో టెన్త్ పరీక్షలకు సన్నాహాలు

కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఆ రోజుల్లో విద్యార్థులకు మాస్క్ లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ విలేకరులతో పలు విషయాలను ప్రస్తావించారు.
ఏపీలో జూలై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనుండగా.. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకోనున్న జాగ్రత్తలపై పలు విషయాలను వెల్లడించారు. విద్యార్థుల కోసం కంటైన్మెంట్ జోన్లు మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 4,154 ఎగ్జామ్ సెంటర్లను గుర్తించామని ఆయన అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్న ఆయన.. పరీక్షా కేంద్రాల్లో ప్రతీ గదికి కేవలం 10 నుంచి 12 మంది విద్యార్ధులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 
 అలాగే టెన్త్ స్టూడెంట్స్ కోసం 8 లక్షల మాస్కులను అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఎగ్జామ్ సెంటర్లలో విద్యార్థులు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని ఆయన అన్నారు. అటు ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు 1,022 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.