రుతుపవనాలు వచ్చేస్తున్నాయి

The monsoon is coming

రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్రం, తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన ఉందన్నారు. జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, చత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో 2 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.
తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడనుంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వడగాల్పులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఆదివారం కొన్నిచోట్ల.. సోమవారం చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.