అదృశ్యమైన వ్యక్తి విగతజీవిగా

man missing and died

ఐదురోజులక్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి ఐదురోజులకు చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం ఎగ్లాస్‌పూర్‌లో నల్లకుంటప్రాంతంలో శుక్రవారం సంఘటన చోటు చేసుకుంది. సైదాపూర్‌ పోలీసులు, గ్రామస్తుల ప్రకారం..ఎగ్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన చిక్కుల కొమురయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు చిక్కుల మొగిలి(35)కి పదేళ్లక్రితం హైదరాబాద్‌లో ఓ మహిళతో వివాహం జరిగింది. మొగిలి చిన్నప్పుడు 7వతరగతి అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఏడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో దొరికాడు. అప్పటినుంచి హైదరాబాద్‌-ఎగ్లాస్‌పూర్‌ వస్తూపోతుంటాడు.
పదేళ్లక్రితం హైదరాబాద్‌ యువతితో పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారు. మార్చిలో కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌తో ఎగ్లాస్‌పూర్‌ వచ్చారు. నెలక్రితం భార్య హైదరాబాద్‌ వెళ్లింది. మొగిలి మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని ఇంటి వద్ద గుంట స్థలం ఇటీవలే విక్రయించిన తండ్రి కొమురయ్య అప్పులు తీర్చాడు. కాగా మొగిలి మద్యానికి బానిసై ఈ నెల 25న సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి రేకొండ వైపు వెళ్లాడు. మొగిలి కనిపించడం లేదని ఈ నెల 28న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఎగ్లాస్‌పూర్‌ గ్రామ శివారులోని నల్లకుంట ప్రాంతంలో గొర్రెల కాపరులు చెట్టుకు ఉరేసుకొని మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇచ్చారు. సైదాపూర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి పిల్లలు లేరు.