టీటీడీ ఆస్థులు జోలికి వ‌స్తే పోరాట‌మే..!

bjp leaders comments on ttd decision

తిరుమల శ్రీవారికి సంబంధించి తమిళనాడులో ఉన్న 23 స్థిరాస్తులను విక్రయించడానికి టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని  బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ క్ర‌మంలో టీటీడీ భూమలును వేలం వేస్తే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని టీజీ వెంకటేష్ హెచ్చరించారు. 

ఆలయ ఆస్తులను అమ్మకూడదని, భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని టీజీ వెంకటేష్ కోరారు. దేవాలయ ఆస్తులు వేలం వేయడానికి లేదని ఇప్పటికే న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం వినకుండా మొండిగా వెళితే కోర్టుకు వెళతామని టీజీ వెంకటేష్ చెప్పారు. నిత్యం కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రజలకు చేయాల్సిన పనులు చేయమని టీజీ వెంకటేష్ కోరారు.

ఇక మ‌రోవైపు తిరుమల శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తులను నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వానికి హక్కు ఉందని, దాన్ని విక్రయించే హక్కు లేదని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలియ‌జేశారు. టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిది.. వెంకన్నకి భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే హక్కు ఉన్న మీరెలా వేలం వేస్తార‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌శ్నించారు. దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగి ఉందనే అనుమానం ఉంద‌న్నారు. టీటీడీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తుంద‌ని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.