నాడు సీబీఐ వ‌ద్దే వ‌ద్దు.. నేడు మాత్రం ముద్దు..!

chandrababu double game politics

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కేవలం మాస్క్‌లు అడిగిందుకు అరెస్ట్ చేసి సుధాకర్‌ను ఇబ్బందుల పాలుచేశారన్నారు. అమానుషంగా అరెస్ట్ చేసి, మానసికంగా బాధపడుతున్నారని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందన్నారు. డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో వాస్తవ విషయాలు బయటపడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఈ క్ర‌మంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చంద్ర‌బాబు చెప్పారు. డాక్టర్ సుధాకర్ అరెస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కుట్ర పన్నిందనే విషయం సీబీఐ విచారణలో భాగంగా బహిర్గతమౌతుందని అన్నారు. ప్రభుత్వం కుట్ర పన్నిందని తాము మొద‌టి నుంచీ చెబుతూనే వస్తున్నామని, ఇప్పుడు అదే దిశగా సీబీఐ ద్వారా విచారణ కొనసాగేలా హైకోర్టు నిర్ణయాన్ని తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని చంద్రబాబు అన్నారు.

అయితే తన ప్రభుత్వ హాయంలో సీబీఐని, చంద్ర‌బాబు‌ నిషేధించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై కక్షసాధించడానికి కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో సీబీఐని ప్రయోగిస్తున్నారని, ఐటీ దాడులను చేయిస్తున్నార‌నే కార‌ణంతో.. తన అనుమతి లేనిదే సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అప్పట్లో జీవోను జారీ చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోను రద్దు చేస్తూ.. సీబీఐకి స్వేచ్ఛను కల్పించారు. అయితే ఇప్పుడు అదే చంద్రబాబు సీబీఐ విచారణను స్వాగ‌తించ‌డం, హైకోర్టు నిర్ణ‌యంపై హర్షం వ్యక్తం చేస్తుండ‌డంతో రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.