సీబీఐకి డాక్టర్ సుధాకర్ కేసు.. స్పందించిన ఆమంచి..!

amanchi krishna mohan comments on dr sudhakar case

న‌ర్సీప‌ట్నం మ‌త్తు డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చిన్న కేసులకూ సీబీఐ దర్యాప్తు చేసుకుంటూ పోతే.. ప్రతి పోలీస్ స్టేషన్‌ల‌లో సీబీఐ ఆఫీసులు పెట్టాల్సి వస్తుందని ఆమంచి అభిప్రాయపడ్డారు. ఈ క్ర‌మంలో డాక్ట‌ర్ సుధాక‌ర్ కేసును ఒక పెట్టీ కేసుగా ఆమంచి కొట్టిపారేశారు. ఇలాంటి తీర్పుల వల్ల న్యాయస్థానాల మీదనే నమ్మకం పోతుందని ఆమంచి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ లేకుంటే తాను హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసేవాడినన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో రాష్ట్రం మొత్తం ఆశ్చర్య పోయిందన్నారు.

ఇక వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో సమావేశమయ్యారు. చీరాలలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అనుచరులతో చర్చించారు.  వైసీపీ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా చీరాలలో ఆమంచి, కరణం వర్గీయులు పోటా పోటీగా ఫ్లెక్సీలు కట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థిితి నెలకొంది. వాలంటీర్ల పోస్టులన్నీ కరణం చెప్పిన వారికే ఇవ్వడంతో తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని ఆమంచి కృష్ణమోహన్ భావిస్తున్నారు. చీరాల నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవిని కరణం వెంకటేష్‌కు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేప‌ధ్యంలో దీంతో అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఆమంచి కృష్ణమోహన్ రెడీ అయ్యారని చెబుతున్నారు. ఇలాగే కరణంకు ప్రాధాన్యత కొనసాగితే పార్టీని వీడేందుకు కూడా వెనకాడబోనని వైసీపీ అధిష్టానానికి ఆమంచి సంకేతాలు పంపినట్లు స‌మాచారం.