తెలంగాణలో షూటింగ్ లు చేసుకునేందుకు షరతులతో కూడిన అనుమతి

TELANGANA GOVERNMENT GIVES PERMISSION TO SHOOTINGS

లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సీఎం సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. టాలీవుడ్‌ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. సినిమా షూటింగులు, ప్రిప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు.సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున ప్రిప్రొడక్షన్, షూటింగుల నిర్వహణ, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న ప్రిప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం చెప్పారు. తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.