చంద్ర‌బాబు పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసిన విజ‌య‌సాయిరెడ్డి..!

vijaya sai reddy sensational comments on chandrababu

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మ‌రోసారి ట్విటర్ వేదికగా, టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల పై కౌంట‌ర్ ఇచ్చారు. చంద్ర‌బాబు బాబు ఐదేళ్ల పాలనలో కాంట్రాక్టర్లు, జన్మభూమి కమిటీలు, ఇసుక మాఫియా మాత్రమే బాగుపడింద‌ని.. 2.5 లక్షల కోట్ల రుణాలు, 60 వేల కోట్ల కాంట్రాక్టర్ల బకాయిలు, 20 వేల కోట్ల కరెంటు అప్పు వదిలి వెళ్లాడ‌ని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపాంచారు. పేద ప్రజలకు రూపాయి ఇవ్వడానికి మనసొప్పలేద‌ని.. గ్రాఫిక్స్‌ను దాటి ఒక్క పని గ్రౌండ్ కాలేద‌ని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇక రాజధాని పేరుతో లక్ష ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి స్కెచ్ వేసిన వ్యక్తి ఇప్పుడు భూములమ్ముతారా అని సుద్దపూసలా ప్రశ్నిస్తున్నాడ‌న్నారు. పూలింగ్ భూముల్లో సింగపూర్ కంపెనీలకు వాటా ఇస్తామని ఒప్పందం చేసుకున్నదెవరు.. ఎల్లో మీడియా దాచిపెట్టింనంత మాత్రాన ప్రజలకు తెలియదనుకుంటున్నావా అని ప్ర‌శ్నించారు. ఇక కలెక్టర్లు, ఎస్పీలే తన బలం అంటూ.. ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదరించిన తీరును గమనిస్తున్నావా చంద్ర‌బాబూ.. అప్పట్లో అధికారుల పై అసంతృప్తి వ్యక్తం చేయడాలు, దిశానిర్దేశాలుండేవన్నారు. ఇక ముఖ్యంగా అంతా తమరే చేస్తున్నట్టు బిల్డప్పులుండేవ‌ని.. విరుచుకు పడ్డట్టు, రంకెలేసినట్టు, త‌మ‌రి ఎల్లో మీడియా డప్పుకొట్టేద‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.