వైసీపీ స‌ర్కార్ పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..! 

pawan kalyan fire on ycp sarkar

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి వైసీపీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేష్‌ను పోలీసులు వేధించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ కారణంగానే లోకేష్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందన్నారు. ఉన్నమట్ల లోకేష్‌ను సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘు వేధించడం వల్లే ప్రాణం తీసుకోవాలనుకున్నాడ‌ని ప‌వన్ అన్నారు.

ఇక‌ అక్రమాలను ప్రశ్నించిన వారిని వేధించడం చట్టమా.. తాము ప్రజలకే జవాబుదారీ తప్ప అధికార పక్షానికి కాద‌ని పోలీసు అధికారులు గుర్తించాల‌న్నారు. జన సేన కార్యకర్త ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసు అధికారి రఘుపై తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.  ఉన్నమట్ల లోకేష్‌కు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని జిల్లా నాయకులకు పవన్ కోరారు. ఈ ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు, ఈ ప్రాంతంలో అధికార పక్షం చేస్తున్న ఇసుక దందాతోపాటు ఇతర అక్రమాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా నాయకులను పవన్ ఆదేశించారు.