టాలీవుడ్ ప్రముఖుల‌తో మంత్రి త‌ల‌సాని భేటీ

టాలీవుడ్ ప్రముఖుల‌తో మంత్రి త‌ల‌సాని భేటీ

మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో టాలీవుడ్‌ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సినిమా షూటింగ్‌ల ప్రారంభం, టాలీవుడ్‌ సమస్యలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించేందుకు సిద్దంగా ఉన్నామని అయితే సినిమా రంగానికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని చిరంజీవి కోరారు. అయితే పోస్ట్‌ ప్రొడక్షన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి హామీ ఇచ్చారు.
షూటింగ్‌లకు అనుమతి సంబంధించిన సీఎం కేసీఆర్‌తో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అయితే ఒకట్రెండు రోజుల్లోనే సినిమా రంగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సినీ రంగానికి సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్‌, దిల్‌రాజు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రాజమౌళి, కొరటాల శివ, సి.కల్యాణ్‌, జెమిని కిరణ్, స్రవంతి రవికిషోర్‌ , వినాయక్‌, త్రివిక్రమ్‌, ఎన్‌.శంకర్ తదితరులు పాల్గొన్నారు.