విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ దీక్ష..!

 telugudesamparty deeksha today 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిరసన దీక్షలు చేపట్టింది. విద్యుత్తు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరోజు దీక్షకు దిగనున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా తమ ఇళ్లలోనే దీక్ష చేపడుతున్నారు. ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తూ విద్యుత్తు ధరలను పెంచిందని టీడీపీ ఆరోపిస్తోంది. 

ఇక విద్యుత్తు ఛార్జీలను పెంచబోనని అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత సీయం జగన్ మోహ‌న్ రెడ్డి మాట తప్పారని చంద్రబాబు ఆరోపించారు. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా గత మూడు నెలలుగా ఉపాధి లేక, వేతనాలు లేక అల్లాడుతున్న జనంపై విద్యుత్తు ఛార్జీల భారం మోపుతున్నారని చంద్రబాబు మండి ప‌డ్డారు. ఇక టీడీపీ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌కు మ‌ద్ద‌తుగా..ప్రజలు స్వచ్ఛందంగా తమ నిరసనను తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మ‌రి విద్యుత్తు చార్జీలు పెంపు వ్య‌వ‌హారం పై ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.