క‌రోనా కేసుల్లో చైనాను దాటేసిన భార‌త్

క‌రోనా కేసుల్లో చైనాను దాటేసిన భార‌త్

భారత్‌లో క‌రోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పుట్టినిల్లు అయిన‌ చైనాలో ఇప్పటి వరకు మొత్తం 82,940 కేసులు నమోదు కాగా, భారత్‌లో అంతకుమించి కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 85,940కి చేరింది.
భారత్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్‌ కేసులు, 103మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,940కి చేరగా 2752 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 30,153 మంది కోలుకోగా మరో 53,035 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
   క‌రోనా వైర‌స్ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌లలో మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ప్రతిరోజు కొత్తగా వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న ఒక్కరోజే 1576పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 29,100కి చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ సోకిన వారిలో 1068 మంది మృత్యువాతపడ్డారు. గుజరాత్ లోనూ మరణాల రేటు కలవర పెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9931 కేసులు నమోదు కాగా 606మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 4595 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 239మంది మరణించారు.