కరోనా హెచ్ఐవీ లాంటిది.. ఎప్పటికీ పోదు - డబ్ల్యూహెచ్ఓ

కరోనా హెచ్ఐవీ లాంటిది.. ఎప్పటికీ పోదు - డబ్ల్యూహెచ్ఓ

కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)మరో సంచలన హెచ్చరిక చేసింది. మహమ్మారి కరోనా హెచ్ఐవి లాంటిదని, ఎప్పటికీపోదని హెచ్చరించింది. 'ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నత నిపుణుడు హెచ్చరించారు. జనవరి 21 నుండి వైరస్ పై రోజువారీ నివేదికను ఇస్తున్న సంస్థ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.
కరోనా వైరస్ ప్రపంచ సమాజంలో హెచ్ఐవీ లాంటి మరొక స్థానిక వైరస్ కావచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్-19 కూడా ఎప్పటికీ పోదని సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. ఈ వైరస్ ఎప్పటికీ దూరంకాకపోవచ్చని ర్యాన్ వ్యాఖ్యానించారు. అలాగే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కరోనావైరస్, లాక్‌డౌన్ పరిమితులను ఎత్తివేయడం మరింత సంక్రమణను దారితీస్తుందన్నారు. ప్రాణాంతక మహమ్మారిని అంతం చేసే టీకా కోసం ఎదురు చూడకుండా జాగ్రత్త వహించాలన్నారు. టీకా లేకుండా ప్రపంచ జనాభా తగినంత స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. ఈ వైరస్ ఎప్పటికి అంతమవుతుందో తెలియదు, దీన్ని నిరోధించగలిగే వ్యాక్సిన్ కనుగొని, దాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తేగలినపుడు మాత్రమే దీన్ని అరికట్టవచ్చని ర్యాన్ స్పష్టం చేశారు.