చరిత్ర సృష్టించిన సానియా మీర్జా

చరిత్ర సృష్టించిన సానియా మీర్జా

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ అవార్డును భారత ఏస్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కైవసం చేసుకుంది. ఆసియా-ఓసియానియా జోన్ నుంచి ఫెడ్‌కప్ హార్ట్ అవార్డుకు నామినేట్ కావడంతోనే రికార్డులకెక్కిన సానియా.. ఈ నెల 1వ‌ తేదీ నుంచి వారం రోజులపాటు నిర్వహించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో విజేతగా నిలిచింది. మొత్తం 16,985 మంది ఓటింగ్‌లో పాల్గొనగా, 10 వేలకు పైగా ఓట్లు అంటే 60 శాతానికి పైగా సానియాకే పోలయ్యాయి.
విజేతగా నిలిచిన సానియాకు 2000 అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.1.50 లక్షలు) నగదు బహుమతి లభించింది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డు గెలుచుకోవడంపై సానియా మాట్లాడుతూ.. ఈ అవార్డు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొంది. అవార్డు ద్వారా లభించిన నగదు మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు సానియా మీర్జా తెలిపింది.