మహిళా ఉద్యోగిపై దాడి చేసిన మేనేజర్ సస్పెండ్

manager suspended due to attack on lady employee

నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగి.. కరోనా నేపథ్యంలో మాస్కు పెట్టుకోవాలని పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌కు సూచించారు. దీంతో ఆగ్రహించిన డిప్యూటీ మేనేజర్‌ ..మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి చేశారు. జుట్టు పట్టకుని కుర్చీలో నుంచి కింద పడేసి.. కుర్చీ హ్యాండిల్‌తో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళా ఉద్యోగి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

టూరిజం హోటల్‌ కార్యాలయంలో జరిగిన ఘటన దురదృష్టకరమని ఏపీ టీడీసీ ఎండీ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. నెల్లూరు పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను సస్పెండ్‌ చేసినట్టు చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకున్నామని వివరించారు. విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా భాస్కర్‌ హెడ్‌క్వార్టర్‌ వదిలి వెళ్లరాదని ఆదేశించారు.