యువతిపై అత్యాచాయత్నం చేసిన వైద్యునికి దేహశుద్ధి

doctor was beaten by public due to attempt rape on a girl

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సత్యానందం అనే పారా మెడికల్ డాక్టర్ నవాబ్‌పేట మారుతీనగర్‌లో క్లినిక్ నడుపుతున్నాడు. అతడు ఆర్‌ఆర్‌పేటలోని ఓ కంటి వైద్యశాలలో పారామెడికల్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తూనే.. స్థానికంగా సొంతంగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఐతే మారుతీనగర్‌కు చెందిన ఓ యువతి తలనొప్పితో బాధపడుతూ సత్యానందం క్లినిక్‌కు వెళ్లింది.

సత్యానందం ఆమెకు ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. కొంచెంసేపు తల తిరుగుతుందని.. ఓపిక పడితే తగ్గిపోతుందని చెప్పాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. భయపడిపోయిన ఆ యువతి బిగ్గరగా కేకలు వేయడంతో.. బయట ఉన్న ఆమె సోదరుడు లోపలికి వెళ్లి, వైద్యుడిని అడ్డుకున్నాడు.

వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. వారంతా అక్కడికి చేరుకున్నారు. సత్యానందానికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.