ప్రజలకు మహేశ్‌ బాబు విజ్ఞప్తి

mahesh try to aware people

సోషల్‌ మీడియా వేదికగా ప్రజలను మహేశ్‌ బాబు మరోసారి అప్రమత్తం చేశారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పాజిటివ్‌ల సంఖ్య భారీగా పెరుగుతున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కఠిన సమయంలో ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని మహేశ్‌ విజ్ఞప్తి చేశారు.
'లాక్‌డౌన్‌ సడలింపులు తర్వాత కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మనల్ని, మన కుటుంబాల్ని, మన చుట్టు పక్కల ప్రజలను రక్షించుకునే సమయమిది. బయటకు వెళ్లేటప్పుడు తప్పుకుండా మాస్క్‌ ధరించండి. భౌతిక దూరాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం సూచించిన అన్ని భద్రతా ప్రమాణాలను పాటించండి. అదేవిధంగా ప్రతీ ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించండి. ఇప్పటివరకు ఎవరైన ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మన చుట్టుపక్కల నమోదయ్యే కరోనా కేసులను సూచిస్తూ ఈ యాప్‌ మనల్ని అప్రమత్తం చేస్తుంది. అంతేకాకుండా అత్యవసర వైద్య సదుపాయాలను కూడా ఆరోగ్యసేతు ద్వారా పొందవచ్చు. అందరూ సురక్షితంగా ఉండండి, బాధ్యతతో వ్యవహరించండి. త్వరలోనే మంచి రోజులు వస్తాయి' అంటూ మహేశ్‌ పోస్ట్‌ చేశాడు.
ఇక దేశంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మహేశ్‌ పలు పోస్టులు చేసిన విషయం తెలిసిందే. అనేక సలహాలు ఇస్తూనే ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ కష్టకాలంలో విశేష సేవలందిస్తున్న కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినప్పటికీ ముందు నుంచి షూటింగ్‌లు వద్దని మహేశ్‌ బాబు వారిస్తునే ఉన్నారు. ఇక తన సినిమా షూటింగ్‌లు కూడా ఇప్పట్లో మొదలు పెట్టడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిర్మాతలకు కూడా తెలిపారని సమాచారం.