చొప్పదండి టికెట్ ఎవరికి?

Updated By ManamMon, 10/15/2018 - 23:42
choppaandi
  • టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న ఉత్కంఠ.. ప్రయత్నాలు ఆపని బొడిగె శోభ

  • టికెట్టు మాకేనంటున్న ఆశావహులు.. పోటీలో సుంకెరవి, సుద్దాల దేవయ్య

imageకరీంనగర్: చొప్పదండి నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చొప్పదండిని మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభ పేరును ప్రకటించకుండా, కొత్త అభ్యర్థిని ఖారారు చేయకుండా రాజకీయ వేడిని సృష్టించారు. దీంతో నియోజకవర్గంలోని ఆశావహులు తెరపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ టికెట్టుతనకే కేటాయించాలంటూ బొడిగె శోభ తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టికెట్టు రాని కొంత మంది నేతలు టీఆర్‌ఎస్‌పై దుమ్మెత్తిపోస్తూ ఇతర పార్టీల్లో చేరుతూంటే, పార్టీ టికెట్టు కోసం చివరి వరకూ తన ప్రయత్నం ఆపనంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. బొడిగె శోభ.  మరో 45 రోజుల్లో ఎన్నికల ప్రకియ పూర్తికావస్తున్నా.. నేటికీ శోభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించక పోవడంతో గులాబీ అధినేత మదిలో మరో ఆలోచన ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారు. గతంలో చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని అధికార పార్టీకి ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరుల బృందం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి చొప్పదండి టికెట్టు బొడిగె శోభకు కేటాయిస్తే తాము సహకరించమని ఖరాఖండిగా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.  దీంతో కేసీఆర్ నియోజవర్గం నుంచి పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతనే టికెట్టు ఎవరికి ఇస్తామనేది ప్రకటిస్తామని తెలిపారు.  ఇటీవల వేములవాడ ప్రచారంలో ఉన్న కేటీఆర్‌ను కలసి తన టికెట్టు విషయం ఆరాతీశారు. స్పందించిన కేటీఆర్ టికెట్ల కేటాయింపు పూర్తిగా కేసీఆర్ చేతిలోనే ఉందని తేల్చి చెప్పారు.  దీంతో చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టింది. మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది .ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రగతిభవన్ తలుపులు తెరుచుకోకపోవడంతో బొడిగె శోభ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆత్మస్తైర్యం కోల్పోయిన ఆమె ఇటీవల కార్యకర్తల ఎదుట కన్నీరుమున్నీరైంది. ఇప్పటికీ కేసీఆర్ తన తండ్రి లాంటి వారని తనకు తప్పకుండా న్యాయం చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

రేస్‌లో సుంకె రవి, సుద్దాల దేవయ్యలు
పెండింగ్‌లో ఉన్న చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్టు రేసులో టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు సుంకె రవి, మాజీ మంత్రి సుద్దాల దేవయ్యలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమకు నియోజకవర్గంలో ఓటు బ్యాంకు ఉందని టికెట్ ఇస్తే గెలిచి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. తమ అనుచరగణంతో సోషల్‌మీడియా సహా గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. సుంకె రవిందర్‌కు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి. మరోనేత సుద్దాల దేవయ్య మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, టీడీపీ శ్రేణులతో సత్సంబంధాలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో సుద్దాలకు టికెట్టు ఇస్తే గెలుపు నల్లేరుమీద నడకనేనని కొంత మంది టీఆర్‌ఎస్ నేతలు అధిష్టానానికి సమాచారం చేరవేస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా  శోభ?
టీఆర్‌ఎస్ పార్టీ టికెట్టు కోసం చివరి క్షణం వరకు వేచిచూస్తానని, ఒకవేళ రాని పక్షంలో చొప్పదండ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. తనకంటూ కార్యకర్తలు, ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో ప్రజల బలంలో తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో శోభక్క అని ఆప్యాయంగా పిలుచుకునేంత సఖ్యత ప్రజల్లో ఉందని ఆమె వెంట గ్రామీణప్రజానికం అండగా ఉంటారని ఆమె ప్రగాఢ విశ్వాసం. ప్రచారంలోనూ ఆమెకు మహిళలు, వృద్ధులు మేమున్నామని హామీ ఇస్తుండడం గెలుపుపై ఆమె ధీమా వ్యక్తంచేస్తున్నారు.

English Title
To whom is the ticket?
Related News