విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగింపు

Pandya Rahul
  • సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ 

  • తాజా షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం 

  • తొలి వన్డే పాండ్య, రాహుల్ దూరం

న్యూఢిల్లీ: టీవీ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఇద్దరిపై సస్పెన్షన్ కొనసాగిస్తున్నట్టు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. దీంతో ఆస్ట్రేలియా మూడో మ్యాచ్‌ల సిరీస్‌లో  భాగంగా శనివారం జరగనున్న తొలి వన్డేకు వీరిద్దరూ దూరమయ్యారు. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ అనే టీవీ ప్రోగ్రాంలో మహిళలపై వీరిద్దరూ వ్యామోహంతో కూడిన వ్యాఖ్యలు చేయడంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో తొలి వన్డే తుది జట్టు నుంచి వీరిద్దరినీ తొలగించారు. ‘కేసు విచారణలో ఉన్నందున పాండ్య, రాహుల్‌లపై సస్పెన్షన్ కొనసాగుతుంది’ అని వినోద్ రాయ్ అన్నారు. అయితే విచారణ మొదలయ్యే ముందు మరోసారి వీరిద్దరికీ తాజాగా షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ‘బీసీసీఐ అంతర్గత కమిటీ లేదా అడ్ హక్ అంబుడ్స్‌మన్ విచారణ పరుపుతారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వాళ్లను జట్టులోనే కొనసాగిస్తాలా? లేక స్వదేశం పంపాలా? అన్న దానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జట్టులోనే కొనసాగించాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ బీసీసీఐలోని చాలా మంది పెద్దలు ఈ ఆలోచనలను వ్యతిరేకిస్తున్నారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఒకవేళ వాళ్లిద్దరినీ స్వదేశంకు పంపినట్టయితే వారి స్థానంలో రిషబ్ పంత్, మనీష్ పాండే జట్టులో చేరతారు. ‘విజయ్ శంకర్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే లేదా రిషబ్ పంత్‌లలో ఏ ఇద్దరిని పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని కూడా ఆ అధికారి చెప్పారు. రాయ్ సీఓఏ సహచరురాలు డయానా ఎడుల్జీ నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు పాండ్య, రాహుల్‌పై సస్పెన్షన్ కొనసాగించారు. వీళ్ల వ్యాఖ్యలు ప్రవర్తన నిబంధనావళిని ఉల్లంఘించడమేనని ప్రకటించేందుకు బీసీసీఐ లీగల్ కమిటీ తిరస్కరించడంతో సస్పెన్షన్ కొనసాగింపు నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఎడుల్జీ రెండు మ్యాచ్‌ల నిషేధంను సూచించారు. కానీ తర్వాత ఈ కేసులు లీగ్ సెల్‌కు అప్పగించారు. ఎడుల్జీ నిర్ణయాన్ని రాయ్ సమర్థించారు.

సంబంధిత వార్తలు