ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు షాకిచ్చిన సావిత్రి

Updated By ManamThu, 05/17/2018 - 21:55
ntr

savitriతెలుగు సినీ పరిశ్రమకు మ‌హాన‌టులు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటివారు. అటువంటి మహానటులు సైతం వారి సినిమాల్లో అల‌నాటి మేటి న‌టి సావిత్రి ఉండాల‌ని నిర్మాతలను డిమాండ్ చేసారంటే.. సావిత్రి నటనా ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ ఇద్ద‌రు హీరోల‌తో సమానంగా అప్పట్లో పారితోషికాన్ని అందుకున్న లేడీ సూపర్ స్టార్ మహానటి సావిత్రి.. రెండు సందర్భాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను సైతం ఆశ్చర్యానికి గురి చేశార‌ట‌.

కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. 1977 సంవ‌త్స‌రంలో ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమలో జరిగిన ప్రకృతి వైపరీత్యానికి  తెలుగు సినీ పరిశ్రమ స్పందించింది. ఆ వైపరీత్యానికి బాధితులైన వారిని ఆదుకోవడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పాటు సావిత్రి కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది అభిమానులు ఎన్టీఆర్‌ను పూలమాలతో సత్కరిస్తే.. ఆ మాలను వేలం పాటలో రూ.10,000కు సొంతం చేసుకున్నారు సావిత్రి. దానికి షాక్ అయిన‌ ఎన్టీఆర్ “కేవ‌లం ఒక పూలదండ‌ కోసం డబ్బులను ఎందుక‌లా దుబారాగా ఖర్చు చేస్తావ్?” అని హెచ్చరించారట. దానికి బదులుగా ఆమె, “ఇది అందరికీ మాలే కాని నాకు మాత్రం వెల కట్టలేని వస్తువు. అదీగాక ఈ రూపంలో ఈ బాధితులకు సాయం చేసినందుకు ఆనందంగా కూడా ఉంది” అని బదులిచ్చారట.

మరొక సందర్భంలో చెన్నైలో ఒక ఇంటిని కట్టుకున్న ఏఎన్నార్, తన పాత ఇంటిని అమ్మకానికి పెడితే.. ఒక బ్లాంక్ చెక్కుతో ఆ ఇంటి విలువను రాసుకోమని చెప్పారట సావిత్రి. దీంతో.. ఏఎన్నార్ షాక్‌కు గుర‌వ‌డ‌మే కాకుండా త‌న‌ ఈగో కూడా హ‌ర్ట‌య్యింద‌ట‌. తన అభిమాన నటుడి ఇంటిని వెల కట్టడం తన వల్ల కాదన్న‌దే ఆమె భావన కావ‌డంతో.. అలా చేశార‌ట‌. ఆమె ఉద్దేశం ఏదైనా.. ఆమె ఎంచుకున్న మార్గం మాత్రం సరైనది కాదని అప్పట్లో కొంతమంది అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏదేమైనా.. ఈ రెండు సందర్భాలను ‘మహానటి’ సినిమాలో చూపించి ఉంటే మ‌రింత‌ బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.

English Title
savitri shocked ntr, anr for those incidents
Related News