ఇండియాకు ఆరో ర్యాంక్

Updated By ManamThu, 07/12/2018 - 07:05
india
  • ఆరో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ మనదే

  • 2.597 ట్రిలియన్ డాలర్లుగా జీడీపీ.. ఏడో స్థానానికి పడిపోయిన ఫ్రాన్సు

  • మొట్ట మొదటి స్థానంలో అవెురికా.. జీడీపీ వృద్ధి 7.4 శాతమన్న ఐఎంఎఫ్

  • మరింత పెరుగుతుందని ఆశాభావం.. అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు

india-eco-graప్యారిస్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మరో మెట్టు పైకి ఎదిగింది. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచి.. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఫ్రాన్సును ఏడో స్థానంలోకి నెట్టేసింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2017 సంవత్సరం ఆఖరుకు 2.597 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫ్రాన్సు మాత్రం 2.582 ట్రిలియన్ డాలర్ల వద్దే ఆగిపోయింది. దాంతో ఫ్రాన్సును తోసిరాజని భారత్ ఆరో స్థానానికి ఎదిగింది. మొట్టమొదటి స్థానంలో అవెురికా ఉండగా, ఆ తర్వాత వరుసగా చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ ఉన్నాయి. 2017 సంవత్సరానికి సంబంధించిన ఈ వివరాలను ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అంతకుముందు బాగా వెనకబాటులో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2017 జూలై తర్వాతి నుంచి వరుసగా బలపడటం మొదలైంది. భారత దేశంలో 134 కోట్ల జనాభా ఉండగా.. ఫ్రాన్సులో మాత్రం 6.7 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. దీనివల్ల భారతదేశంలో తలసరి ఆదాయం ఫ్రాన్సు కంటే చాలా తక్కువ అవుతుంది. మన దేశంలో ఒక్కో వ్యక్తికి ఏడాదికి ఉండే తలసరి ఆదాయం కంటే ఫ్రాన్సు వాళ్లది దాదాపు 20 రెట్లు ఎక్కువ అవుతుందని ప్రపంచబ్యాంకు చెప్పింది. గత సంవత్సరం వరకు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగా ఆర్థిక వ్యవస్థలో కొంత మందగమనం కనిపించినా, ఆ తర్వాత ఉత్పాదక రంగం, వినియోగదారుల వ్యయం ఎక్కువగా వృద్ధి చెందడంతో ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంది. గత దశాబ్ద కాలంలోనే భారత జీడీపీ రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది దేశంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతం వరకు ఉంటుందని, 2019లో అది 7.8 శాతం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అదే అంతర్జాతీయ సగటు మాత్రం కేవలం 3.9 శాతం ఉండటం గమనార్హం. ఈ సంవత్సరం ఆఖరుకల్లా బ్రిటన్, ఫ్రాన్సు రెండు ఆర్థిక వ్యవస్థలనూ భారత్ దాటిపోతుందని లండన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2032 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కూడా తెలిపింది. ప్రస్తుతం.. అంటే 2017 చివరినాటికి బ్రిటన్ 2.622 ట్రిలియన్ డాలర్లతో ప్రంపచంలో ఐదో స్థానంలో ఉంది. 

Tags
English Title
Rank to Sixth India
Related News