ఈబీసీ కోటాపై సుప్రీంలో పిటిషన్

Supreme Court
  • ఆర్థిక స్థితిగతులు రిజర్వేషన్లకు మూలం కాదు

  • పార్లమెంట్ ఆమోదించిన బిల్లు చెల్లదు

  • సుప్రీం కోర్టులో కౌశల్ కాంత్ మిశ్రా పిటిషన్

న్యూఢిల్లీ: అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రిజర్వేషన్లకు కేవలం ఆర్థిక స్థితిగతులు మాత్రమే కారణంగా చూపలేమని, అందువల్ల ఆ బిల్లును రద్దు చేయాలని యూత్ ఫర్ ఈక్వాలిటీ ఆర్గనైజేషన్, కౌషల్ కాంత్ మిశ్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు ఆధారంగా ఆర్థిక అసమానతలను చూపలేమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.  రాజ్యాంగం మౌలిక స్వరూపానికి కొత్త బిల్లు విరుద్ధమని, 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని మించరాదని అన్నారు. పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బుధవారం సుమారు పది గంటల చర్చ తర్వాత రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించింది. ప్రస్తుతం కుల ఆధారిత రిజర్వేషన్లు 50 శాతానికి అదనంగా ఈ పది శాతం ఈబీసీ కోటాను ప్రభుత్వం తీసుకురానుంది. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మెజార్టీ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.

అప్పట్లో ఇంద్రాసాహ్ని పిటిషన్..
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న మోదీ సర్కార్ నిర్ణయంపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నిర్ణయాన్ని సవాలు చేయడానికి సీనియర్ అడ్వొకేట్ ఇందిరా సాహ్నీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కూడా ఇదే ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈమే కోర్టులో కేసు వేశారు. దీంతో అప్పట్లో సుప్రీంకోర్టు కుల ఆధారిత రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించింది. కాగా,  మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అర్హులైన జనరల్ కేటగిరీ అభ్యర్థులు తమ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఇందిరా సాహ్నీ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును కోర్టులో సవాలు చేస్తామని,  రాజ్యాంగ సవరణ బిల్లుపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఆలోచిస్తున్నానని చెప్పారు. ఈ బిల్లు రిజర్వేషన్లను 60 శాతానికి తీసుకెళ్లి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం చేస్తుంది కాబట్టి దీనిని కోర్టు కొట్టేసే అవకాశం ఉంటుంది అని ఆమె చెప్పారు.  1992లోనూ అప్పటి పీవీ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నమే చేస్తే ఎంతో మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని, దీంతో తాను కోర్టులో సవాలు చేసినట్లు ఇందిరా సాహ్నీ వెల్లడించారు. ఆ కేసుపై ఎన్నో బెంచ్‌లు విచారణ జరపగా.. చివరిగా వెంకటాచలయ్య నేతృత్వంలోని బెంచ్ తీర్పును వెలువరించింది. ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుగా ఫేమసైన ఆ కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తులు కలిగిన ధర్మాసనం రిజర్వేషన్ల పరిమితిని 50 శాతంగా నిర్ణయించింది. ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న పీవీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ ధర్మాసనం కొట్టేసింది. వెనుకబాటుతనం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం కుల ఆధారంగా నిర్ణయిస్తారు తప్ప ఆర్థిక పరిస్థితులను బట్టి కాదు అన్నది ఆ తీర్పులోని ప్రధాన భాగం. 

సంబంధిత వార్తలు